ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):రాష్ట్రంలో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. అవినీతి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కూటమి ముఖ్యనేతలు పాల్గొన్నారు. అమిత్‌షాకు చంద్రబాబు పుష్పగుచ్ఛం ఇచ్చారు. అనంతరం శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆ తర్వాత అమిత్‌షా కూడా చంద్రబాబును శాలువాతో సత్కరించారు.
రెండేళ్లలో పోలవరం పూర్తి: ఆంధ్రాలో భూ మాఫియాను అంతం చేసేందుకు, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డామని అమిత్ షా తెలిపారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రను కాపాడతామని, తెలుగు భాషను రక్షిస్తామని అన్నారు. జగన్‌ రెడ్డీ గుర్తుంచుకో బీజేపీ ఉన్నంత వరకూ తెలుగు భాషను అంతం కానివ్వమని స్పష్టం చేశారు. రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరానికి జాతీయహోదా ఇవ్వడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. జగన్‌ రెడ్డి అవినీతిలో కూరుకుపోయి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తవుతుందని భరోసా ఇచ్చారు.
అమరావతిని మళ్లీ రాజధానిగా చేయడానికే కూటమిగా ఏర్పడ్డాం- అమిత్‌షా:రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రథమ స్థానంలో నిలిపారు : మూడోసారి మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనని ధీమా అమిత్ షా వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించేందుకు, ఉగ్రవాదులు, నక్సలైట్లను అరికట్టేందుకు ఆయన్ను మళ్లీ ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రథమ స్థానంలో నిలిపారని గుర్తు చేశారు. విభజన తర్వాత కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్లారని, ఆయన చేసిన అభివృద్ధిని జగన్‌ అధోగతి పట్టించారని, మద్య నిషేధం చేస్తానని ఇచ్చిన మాట తప్పారని, మద్య నిషేధం చేయకపోగా, సిండికేట్‌కు తెరలేపారని నిప్పులు చెరిగారు. ఆరోగ్యశ్రీకి నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారని, చంద్రబాబు, మోదీని గెలిపిస్తే రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 25కు 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని, అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లతో చంద్రబాబును సీఎంను చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రామమందిర పునఃప్రతిష్ఠకు రాని రాహుల్‌, జగన్‌కు ఓటేస్తారా? :70 ఏళ్లుగా అయోధ్య రామమందిరం నిర్మాణం జరగకుండా కాంగ్రెస్‌ అడ్డుకుందని అమిత్‌షా ఆరోపించారు. రెండోసారి ప్రధానిగా మోదీ వచ్చాకే రామమందిర ప్రతిష్ఠ జరిగిందని గుర్తు చేశారు. రాహుల్‌, జగన్‌కు ఇద్దరికీ రామమందిర ప్రతిష్ఠకు ఆహ్వానించామని, రామమందిర పునఃప్రతిష్ఠకు రాని రాహుల్‌, జగన్‌కు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. చట్టసభలో మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్లు తెచ్చామని, 80 కోట్ల మంది పేదలకు ఉచిత బియ్యం అందిస్తున్నామని తెలిపారు.
ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు? : ఈ సందర్భంగా ‘ఇండియా’ కూటమిపై అమిత్‌షా విమర్శలు గుప్పించారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, స్టాలిన్‌, రాహుల్‌ గాంధీ వీరిలో ఎవరిని చేస్తారో చెప్పాలని అన్నారు. ఆ కూటమిలో ప్రధాని అభ్యర్థే లేరని ఎద్దేవా చేశారు.