ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): కోవూరు నియోజకవర్గంలో నుంచి గ్రావెల్ మాఫియాను తరిమికొట్టాలని, తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయిన తనను గెలిపించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధిలోని వవ్వేరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రశాంతి రెడ్డి వవ్వేరు పరిసరాల్లోని కనిగిరి రిజర్వాయర్ వద్ద ప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగిన ప్రదేశాలకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ ఇల్లీగల్ గ్రావెల్ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం దోచుకున్న ప్రసన్న కుమార్ రెడ్డిని సాగనంపాలని పిలుపునిచ్చారు. అక్రమ గ్రావెల్ రవాణా కారణంగా వవ్వేరు ప్రాంతంలో రోడ్లు ధ్వంసమై కల్వర్టులు కూలిపోయే పరిస్థితి వచ్చినా కనీసం మరమత్తులు చేయించలేని ఎమ్మెల్యే మనకు అవసరమా? అని ప్రశ్నించారు. వవ్వేరులో గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప వైసిపి హయాంలో ఒక్క పని జరగలేదని ప్రశాంతి రెడ్డి విమర్శించారు. ఇఫ్కో సెజ్ మరియు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇళ్ళు లేని బడుగు బలహీన వర్గాలకు పక్కా ఇళ్ళు కట్టిస్తామని హామీ యిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి తీసుకొచ్చి మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే సమర్ధత చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. మీరందరు సైకిల్ గుర్తు పై కోవూరు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి వలసిందిగా విజ్ఞప్తి చేశారు.