ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): మద్య నిషేధ కమిటీ చైర్మన్ గా విశిష్ట కృషిచేసిన వావిలాల గోపాలకృష్ణయ్య చేసిన సేవలు ఘనమైనవని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కొనియాడారు.పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య 21వ వర్ధంతి సందర్భంగా ఈనెల సోమవారం సత్తెనపల్లిలోని వావిలాల ఘాటు వద్ద జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మానవత చైర్మన్ పావులూరి రమేష్, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ.నారాయణ రెడ్డి లతోపాటు వావిలాల గోపాలకృష్ణయ్య మనవడు మాన్నవ షోడేకర్ లు ఘన నివాళులు అర్పించారు. కీర్తిశేషులు వావిలాల గోపాల కృష్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నాలుగుసార్లు సత్తెనపల్లి శాసన సభ్యునిగా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, మద్య నిషేధ కమిటీ చైర్మన్ గా విశిష్ట కృషిచేసిన వావిలాల గోపాల కృష్ణయ్య ధన్యజీవి, స్ఫూర్తి ప్రదాత అని వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి కొనియాడారు. 1990 దశాబ్దంలో వావిలాల గోపాల కృష్ణయ్య తో కలిసి సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం, మద్య నిషేధ ఉద్యమంలో పనిచేశామని గుర్తు చేసుకున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భూమిక వహించారన్నారు.గ్రంథాలయ ఉద్యమానికి ఊతం ఇచ్చారని తెలిపారు. నిరాడంబరతకు నిలువు ఎత్తు నిదర్శనం గా వావిలాల 97 సంవత్సరాలు జీవించి దాదాపు 8 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో నిజాయితీగా పనిచేసిన మహనీయుడు వావిలాల గోపాలకృష్ణయ్యను ఆదర్శవంతంగా జీవించాలని అన్నారు. నేటి రాజకీయ నాయకులు గోపాలకృష్ణయ్య అడుగుజాడల్లో పనిచేస్తే సమాజ మార్పుకు దోహదపడుతుందని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి సూచించారు.